Big Storm: అమెరికాలోని కాలిఫోర్నియాకు భీకర తుపాను ముప్పు పొంచి ఉంది. ఆ రాష్ట్రంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో గురువారం తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. ‘భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల వరదల ముప్పు భారీగా పొంచి ఉంది. అవి లోతట్టు ప్రాంతాలకు తీవ్ర ప్రమాదంగా మారతాయి’ అని వెల్లడించింది.
ఈ తుపానుతో చిన్న కాలువలు, సరస్సులు పొంగే ప్రమాదం ఉందని.. తర్వాత నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, రోడ్లన్నీ వరదలతో నిండిపోతాయని వాతావరణ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా, ఈ హెచ్చరికల నేపథ్యంలో మాంటిరే కౌంటీ తన ప్రజలను అప్రమత్తం చేసింది. రెండు వారాలకు సరిపడిన సరకులను దగ్గర ఉంచుకోవాలని స్థానికులకు సూచించింది.
అలాగే ఇసుక బ్యాగులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. వరద ముప్పు నివారణ చర్యల్లో భాగంగా ఇసుక బ్యాగులను వాడేందుకు ఈ సూచన చేసింది వాతావరణ శాఖ.
గత కొంతకాలంగా కాలిఫోర్నియా(California) ప్రకృతి వైరీత్యాలతో వణికిపోతోంది. ఫిబ్రవరిలో ముంచుగుప్పిట్లో మునిగి పోయింది. దాదాపు 70mph వేగంతో వీచిన గాలులు అల్లకల్లోలం చేస్తున్నాయి.
కాగా, గత నెలలో కాలిఫోర్నియాలో మంచు భీకరంగా కురిసింది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి.
దాదాపు లక్షకుపైగా ఇళ్లలో కరెంట్ సరఫరా నిలిచి పోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు కూడా క్లోజ్ అయ్యాయి.
1989 తర్వాత తొలిసారిగా అక్కడ బ్లిజ్జార్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలులు ప్రజలను గజగజ వణికించాయి. దక్షిణ కాలిఫోర్నియాలో రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అనేక చోట్ల ప్రధాన రహదారులను కూడా మూసివేశారు.
మెక్సికో, కాలిఫోర్నియా, కెనడా, పసిఫిక్ నార్త్‌వెస్ట్‌ను కలిపే అంతర్రాష్ట రహదారిని కూడా మూసివేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.
మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజాగా ఆకస్మిక వరదలు రావొచ్చన్న అధికారుల హెచ్చరికలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.