Ulavacharu Recipe: దక్షిణ భారతీయులు ఆహారంలో సాధారణంగా ఉండేవి రెండే. అవి సాంబార్, రసం. మన పూర్వీకుల కాలంలో ఉలవచారు చాలా ఫేమస్. కానీ ఇప్పుడు ఎవరికీ అది గుర్తుకు లేదు. ఉలవచారు శరీరానికి చాలా పోషకాలతో పాటూ, శక్తి లభిస్తుంది. నీరసం దరిచేరదు. ఉలవల్లో ఇనుము, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మధుమేహరోగులకు ఉలవచారు చాలా మేలు చేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పిల్లలకు కూడా ఉలవచారు చాలా మేలు చేస్తుంది. ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఆకలిని పెంచే గుణాలు కూడా ఇందులో అధికం. బరువు తగ్గడానికి కూడా ఉలవచారు సహకరిస్తుంది. నీరసం, అలసట కలగకుండా కాపాడుతుంది. మహిళలకు రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. మూత్రశయంలో రాళ్లు ఉంటే వాటిని కరిగించే సమర్థత ఉలవలకి ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉలవచారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఉలవచారు తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఉలవలు – ఒక కప్పు, ఉల్లిపాయలు – రెండుపచ్చిమిర్చి – మూడుచింతపండు – తగినంత,పసుపు – చిటికెడు, కారం – ఒక స్పూను,జీలకర్ర – అర స్పూను,వెల్లుల్లి రెబ్బలు – మూడు, ఎండు మిరపకాయలు – రెండు,నూనె – సరిపడినంత,నీళ్లు – సరిపడినన్ని,ఆవాలు – అరస్పూను, కరివేపాకు – గుప్పెడు
ముందుగా ఉలవలను బాగా కడిగి, రెండు గంటల పాటూ నానబెట్టుకోవాలి. నానబెట్టిన ఉలవలని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. వడపోసి చిక్కటి మిశ్రమాన్ని తీసుకుని, పొట్టును బయటపడేయాలి. ఆ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవచ్చు. ఆ ఉలవ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా కలపాలి. చింతపండు నానబెట్టి తీసిన రసాన్ని కూడా వేయాలి. మంటను మీడియం స్థాయిలో పెట్టి ఓ అరగంట సేపు మరిగించాలి. మధ్యలో గుప్పెడు కరివేపాకులు, కాస్త నెయ్యి జోడించాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి వేయించాలి. ఆ పోపును మరుగుతున్న ఉలవచారులో వేయాలి. ఓ అయిదు నిమిషాల మరిగించాక ఆపేయాలి. ఉలవచారు తయారయినట్లే. దీనిని వేడి అన్నంలో కలుపుకుని తినాలి.