Pottikkalu: కాలం మారుతున్న కొద్దీ కొత్తరుచులు వచ్చి పాత రుచులు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో పనసాకు పొట్టిక్కలు ఒకటి. పనస బుట్టలు ఉత్తరాంధ్ర వారి ప్రత్యేక వంటకం. వినాయక చవితికి తప్పక వండుతారు. లేత పనసాకులను బుట్టలా కుట్టి అందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని పొట్టిక్కలు అని కూడా అంటారు.పొట్టిక్కలను కొందరు కొట్టక్కబుట్టలని, మరికొందరు కొట్టుంగ బుట్టలని పిలుస్తుంటారు. ఇది ఇడ్లీనే. మామూలుగా ఇడ్దీ గుత్తిలో ఉడకబెడితే అది ఇడ్లీ. కుడుము గిన్నెలో ఉడకబెడితే అది ఆవిరికుడుము. పనన ఆకుల్లో ఉడకబెడితే అది పొట్టిక్క. ఇంతకీ వీటిని ఎలా తయారు చేసుకోవాలి?
పొట్టిక్కల తయారీకి కావలసిన పదార్దాలు..
మినపపప్పు – 1 కప్పు
ఇడ్లీ రవ్వ – 3 కప్పులు
ఉప్పు – సరిపడేటంత
పనస ఆకులు
తయారు చేసే విధానం..
పనసాకులు తెచ్చి వాటిని శుభ్రం చేసి నాలుగు ఆకులను కలిపి ఒక బుట్టలా కుడతారు. మూడాకుల తొడిమలు తీసి వేసి, ఆకు కొసలను దగ్గరగా ఒకదాని మీద ఒకటి పెట్టి పుల్లలతో విస్తరి కుట్టినట్టుగా కుడతారు. ఒకాకు తొడిమను మాత్రము ఉంచుతారు. ఆ తొడిమతో బుట్టను పట్టుకుంటారు. మినపపప్పును మూడు గంటలు నానవేసి, మెత్తగా రుబ్బుకోవాలి. దానికి ఇడ్లీ రవ్వను కలిపి కొంత సేపు నాననిచ్చి దానికి తగినంత ఉప్పును కలపాలి. ఈ పిండిని ఈ బుట్టలలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. పనస ఆకుల బుట్టలతో కలిసి ఉడకడంతో దీనికి మంచి రుచి వస్తుది. దీనిని కొబ్బరి పచ్చడి లేక అల్లపు పచ్చడి లేక బొంబాయి చట్నీతో తింటే మంచి రుచిగా ఉంటుంది.