Coconut Ladoo Recipe: మనం వంటింట్లో పచ్చి కొబ్బరిని ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పచ్చడిని, కొబ్బరి చట్నీని, కొబ్బరి అన్నాన్ని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసుకోగలిగే తీపి పదార్థాలలో కొబ్బరి ఉండలు కూడా ఒకటి. ఈ కొబ్బరి ఉండలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కొబ్బరి ఉండల తయారీలో మనం బెల్లాన్ని ఉపయోగిస్తాం కనుక ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
బెల్లం కొబ్బరి ఉండల తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయ – 1 బెల్లం – ఒక కప్పు, నెయ్యి – ఒకటిన్నర టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
ముందుగా కొబ్బరికాయను పగల కొట్టి అందులో నుండి పచ్చి కొబ్బరిని తీసి తురుము తయారు చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి ముందుగా తయారు చేసిన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలి. కొబ్బరి తురుము వేగిన తరువాత బెల్లాన్ని వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి లేత పాకం వచ్చే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 12 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. లస్కోరాగా పిలిచే ఈ కొబ్బరి ఉండలను తినడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది.