Aloo 65 Recipe: బంగాళాదుంప‌ల‌తో ఆలూ 65

బంగాళాదుంప‌ల‌తో కూర‌ల‌నే కాకుండా చిరు తిళ్ల‌ను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు అన‌గానే అంద‌రికి ముందుగా చిప్స్ గుర్తుకు వ‌స్తాయి. చిప్స్‌ మాత్ర‌మే కాకుండా బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.

  • Written By:
  • Updated On - August 20, 2022 / 03:45 PM IST

Aloo 65 Recipe: బంగాళాదుంప‌ల‌తో కూర‌ల‌నే కాకుండా చిరు తిళ్ల‌ను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు అన‌గానే అంద‌రికి ముందుగా చిప్స్ గుర్తుకు వ‌స్తాయి. చిప్స్‌ మాత్ర‌మే కాకుండా బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటితో మ‌నం ఆలూ 65 ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 ని ఎలా త‌యారు చేసుకోవాలి.

ఆలూ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – అర కిలో, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండు మిర్చి – 2, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఆలూ 65 త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో లేదా గిన్నెలో బంగాళాదుంప‌ల‌ను వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌రీ మెత్త‌గా కాకుండా బంగాళాదుంప‌ల‌ పై ఉండే పొట్టు వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత బంగాళాదుంప‌లపై ఉండే పొట్టును తీసి కావ‌ల్సిన ప‌రిమాణంలో ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసుకుంటూ పిండిలా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత ముందుగా క‌ట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి పిండి ప‌ట్టేలా క‌లుపుకున్న బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి వేయించాలి. మ‌రో క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు మిర్చి, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకును ఒక దాని త‌రువాత ఒక‌టి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత పెరుగును కొద్దిగా, ఉప్పును వేసి క‌లిపి చిన్న మంట‌ పై 2 రెండు నిమిషాల పాటు ఉంచి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌లిపి మ‌రో 3 నిమిషాల పాటు ఉంచి చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి కలపాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 త‌యార‌వుతుంది. సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా తినడానికి ఇది చాలా  బాగుంటుంది.