Aditi Sharma: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటున్నారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.. ఎప్పుడు విడిపోతున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు రెండేళ్లు కూడా కలిసి ఉండడం లేదు. ప్రేమించుకున్నవారు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు.పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఇప్పుడొక ట్రెండ్ గా మారిపోయింది.
తాజాగా ఒక టీవీ నటి.. రహస్యంగా పెళ్లి చేసుకొని నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే భర్త నుంచి విడాకులు కోరడం సంచలనం సృష్టిస్తోంది. ఆమె ఎవరో కాదు అదితి శర్మ. యే జాదు హై జిన్ కా, అండ్ రబ్ సే హై దువా లాంటి సీరియల్స్ తో ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. యే జాదు హై జిన్ కా తెలుగులో జిన్ మాయాజాలం పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ కూడా ఆమె సుపరిచితమే. ప్రస్తుతం ఆమె అపోలీనా అనే సీరియల్ లో నటిస్తోంది.
ఇక అదితి గత కొంతకాలంగా అభినీత్ కౌశిక్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అభినీత్.. ఆమె మేనేజర్ అని తెలుస్తోంది. ఖత్రోన్ కే ఖిలాడి షో సమయంలో అదితితో పాటే అభినీత్ కూడా ఉన్నాడు. నాలుగేళ్లుగా అదితి- అభినీత్ కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, నాలుగు నెలల క్రితమే అదితి, అతనిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు అదితి తనతో నటిస్తున్న సమర్ధ్య గుప్తాతో ఎఫైర్ నడుపుతుందని అభినీత్ ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు తనకు విడాకులు కావాలని ఆమె తనను బెదిరిస్తుందని చెప్పుకొచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో అభినీత్ మాట్లాడుతూ.. ” అదితి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మొదట నాకు సంతోషంగా అనిపించినా.. కుటుంబ సభ్యుల గురించి అలోచించి కొద్దిగా ఆగుదామని ఆపాను. కానీ, ఆమె నా మాట వినలేదు. అందుకే మా పెళ్లి గురించి ఎవరికీ తెలియకూడదు అని కండీషన్ పెట్టి.. ఇంట్లోనే ఇద్దరు పురోహితుల మధ్య మా ఫ్యామిలీ అంగీకారంతో అదితిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను.
పెళ్లి తరువాత అదితితో నాకు పొసగలేదు. అందుకు కారణం నటుడు సమర్ధ్య గుప్తా. అతనితోనే ఆమె ఎఫైర్ నడుపుతుంది. వారిద్దరిని నేను ఒకటిగా చూసాను. అప్పుడే లీగల్ టీమ్ మా మధ్యకు వచ్చింది. ఆమె మా పెళ్లిని మోక్ ట్రయిల్ అని హేళన చేసింది. అదితి తల్లిదండ్రులు విడాకులు ఇవ్వాలంటే రూ. 25 లక్షలు భరణంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అదితి తండ్రి నన్ను చెంప దెబ్బ కొట్టాడు. దీనివలన పరిస్థితులు తీవ్రతరంగా మారాయి. ఆ గొడవలో అదితికి గాయమైంది” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం అదితి పెళ్లి వార్త బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు అదితి పెళ్లి ఎప్పుడయ్యింది.. ? ఇప్పుడు ఈ విడాకులు ఏంటి.. ? అని షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ విషయమై అదితి నోరు విప్పలేదు. మరి ముందు ముందు ఆమె మీడియా ముందుకు వచ్చి ఈ ఆరోపణలపై క్లారిటీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి.