NET-TET Exams: ఒకేసారి రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు..టెట్ వాయిదా వేయాలని విజ్ఞప్తి

NET-TET Exams conducted same day: తెలంగాణలో మరోసారి పరీక్షల తేదీలపై గందరగోళం ఏర్పడింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్టు పరీక్షలు, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ పరీక్షలు ఒకే టైమ్‌లో రావటం వల్ల ఈ రెండింటికీ హాజరయ్యే కొందరు విద్యార్థులు టెట్ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకేరోజు రెండు పరీక్షలు
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్టును జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని యూజీసీ ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టెట్ పరీక్ష కూడా జనవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. రెండు పరీక్షల షెడ్యూల్ ఒకే టైంలో ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దాన్ని వాయిదా వేయటం కుదరదు గనుక టెట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.

యూజీసీ నెట్ షెడ్యూల్…
దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ కోసం ఏటా నెట్ పరీక్ష జరుగుతోంది. దీనిని రెండుసార్లుగా.. జూన్, డిసెంబర్‌లో నిర్వహిస్తున్నారు. కాగా, ఈసారి యూజీసీ నెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తు నవంబర్ 19న ప్రారంభం కాగా, డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజును ఈ నెల 11 లోపు చెల్లించవచ్చవని యూజీసీ ప్రకటించింది. పరీక్ష 2025 జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని తెలిపింది.

రెండో టెట్ నోటిఫికేషన్..
తెలంగాణలో టెట్ పరీక్ష కోసం నవంబర్ 3 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 1 నుంచి 20 వరకు ఈ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, నెట్ పరీక్షకు హాజరయ్యే వారిలో అనేకులు బీఈడీ కూడా చేసి టెట్ రాయటానికి దరఖాస్తు చేసినందున ఈ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. అలాగే, స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని నిబంధనలు ఉండటంతో వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్ష రాయనున్నారు.