APPSC Group 2 Mains Key 2025: గ్రూప్-2 పరీక్షలు సజావుగా ముగిశాయని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. వారిలో 92శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం సూచించినా యథావిధిగా..
గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని, హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖరాశారు.
కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో..
శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తుచేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణపై శనివారం రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి వరకు వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్నవారు.. దూరప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు.
తలపై జీలకర్ర బెల్లంతోనే పరీక్షకు..
తెల్లవారుజామునే పెండ్లి జరిగింది. వెంటనే పరీక్ష ఉంది. ఎగ్జామ్ వాయిదా వేయలేం కదా.. అందుకే పెళ్లి దుస్తులతోనే ఓ నవ వధువు పరీక్ష కేంద్రానికి వచ్చింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన నమిత గ్రూప్2 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. తెల్లవారుజామున ఆమె వివాహనం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతో పరీక్ష కేంద్రానికి వచ్చింది. స్నేహితులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్‌కు వచ్చిన మిగతా అభ్యర్థులు ఆసక్తిగా ఆమెను గమనించారు.