Lord Siva : హర హర మహాదేవ శంభో శంకర.. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని అంటారు. అలాంటి సృష్టిలయ కారకుడైన మహా శివుడికి వేల సంఖ్యలో ఆలయాలు.. కోట్లలో అభిమానులు ఉన్నారు. అయితే శివుడికి సంబంధించిన కొన్ని అరుదైన శైవ క్షేత్రాలు వున్నాయి. వాటిల్లో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ క్షేత్రాలు ఏంటి ? ఎక్కడున్నాయో ?? మీకోసం ప్రత్యేకంగా..
ముక్తేశ్వరాలయం..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు.. కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడి ఆలయం ఉంది. సంవత్సరంలో ఆర్నెల్ల పాటు నీటిలోనే ఉంటుంది. ఆ సమయంలో స్వామిని దేవతలు ఆరాధిస్తారని.. కృష్ణమ్మ వరద తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం.. కానీ ఇక్కడ అమ్మ వారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి.
సిద్ధేశ్వరాలయం..
అనంతపురం జిల్లా అమరాపురం హేమావతి గ్రామంలోని వుండే సిద్ధేశ్వరాలయంలో మాత్రం శివుడి ఎదురుగా నంది వుండదు. ఇదే ఆలయంలోని ప్రత్యేకత. ఇక్కడ శివుడు ఉగ్ర రూపుడిగా దర్శనమిస్తాడు. ఇందుకు ఓ పురాణగాధ కూడా ఉంది. దక్షయజ్ఞం జరిగిన సమయంలో శివుడు వద్దన్నా తండ్రి చేసే యాగానికి సతీదేవి వెళ్తుంది. అప్పుడు సతీదేవి వెంట తన వాహనమైన నందిని తోడుగా పంపుతాడు శివుడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలను అర్పిస్తుంది. సతిని కోల్పోయిన శివుడు ఉగ్రతాండవం చేశాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకి కనిపించేది. సతి వెంట నంది వెళ్ళినందున ఈ శివాలయంలో నంది విగ్రహం వుండదు.
లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరులు..
కర్ణాటక రాష్ట్రం దక్షణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని సూర్య గ్రామంలో లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరుల కొలువై వున్న పుణ్యక్షేత్రం వుంది. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి. దేవాలయానికి సమీపంలో ఒక ఉద్యానవనం వుంటుంది. ఇందులో రెండు శిలారూపాలుంటాయి. వీటినే శివపార్వతులుగా భావించి భక్తులు పూజిస్తారు. మనం కోరిన కోరిక తీరితే ఆ కోరికెను బొమ్మ రూపంలో స్వామికి మొక్కుగా చెల్లిస్తారు.
శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం..
సాధారణంగా శివుడిని ఝటాఝూటంతో చూస్తాం కానీ తూర్పుగోదావరి జిల్లాలోని పలివెలలో లింగరూపంలో వున్న స్వామిని ఝటాఝూటంతో చూడవచ్చు. ఇక్కడ శివుడు శ్రీ ఉమా కొప్పులింగేశ్వరుడిగా దర్శనమిస్తాడు.
కపోతేశ్వరాలయం..
తూర్పుగోదావరి జిల్లా కడలిలో శివలింగం పైభాగంలో రెండు పావురాలు, మంటపంలో నంది వెనుక భాగంలో వేటగాడు.. ఇలా ఈ విధంగా వుండే శివుడి ఆలయం ఉంది. కపోతేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైంది.
లింగోద్భవ క్షేత్రం..
గుంటూరు జిల్లా చందోలులో తేజోలింగ రూపంలో శివుడిని దర్శించుకోవచ్చు. లింగోద్భవ క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రంలో 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివలింగం వుంది. లింగంపై హంస రూపంలో బ్రహ్మ, అడుగుభాగాన వరాహ రూపంలో విష్ణుమూర్తి రూపాలు కనిపిస్తాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/