Tax planning: మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఆర్జించిన ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. పెట్టుబడులు కూడా పూర్తయ్యే ఉంటాయి. కానీ, కొంతమంది ఆఖరి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చివరి నిమిషంలో హడావిడి పడుతుంటారు. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఎంచుకునే పథకాల విషయంలో కూడా కొన్ని తప్పులూ చేయడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో పన్ను మినహాయింపు కోసం పొదుపు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
స్పష్టత అవసరం
ముందు స్పష్టత రావాల్సిన అంశం ఏంటంటే.. ఎంత పన్ను చెల్లించాలి? అనేది. 2022-23 ఆర్థిక సంవత్సరం (2023-24 అసెస్‌మెంట్ ఇయర్) కు సంబంధించి మీరు ఎంత పన్ను కట్టాలనేది చూసుకోవాలి. మీ మొత్తం ఆదాయం, పన్ను శ్లాబులు లెక్క వేతనం, వ్యాపారం, డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, షేర్లు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చిన చిన్న, దీర్ఘకాలిక లాభాలు, గిఫ్టులు.. ఇలా అన్ని విధాల వచ్చిన ఆదాయాన్ని లెక్కలు వేసుకోవాలి.
ఆదాయపు పన్ను శాఖ వద్ద వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో మీ ఆదాయం, అధిక విలువగల లావాదేవీలన్నీ ఉంటాయి. తర్వాత మీ ఆఫీస్ అకౌంట్స్ విభాగంతో మాట్లాడి, ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుంది.. ఆదా చేసుకునేందుకు ఉన్న అవకాశాలు తెలుసుకోవాలి. ఇప్పటికే టీడీఎస్ రూపంలో కొంత మేర చెల్లించి ఉంటారు.
కాబట్టి, మార్చి నెలలో ఇంకా ఎంత పన్ను కోత పడుతుంతో చూసుకోవాలి. ఆ తర్వాతే పెట్టుబడి కోసం ఎలాంటి పథకాలు సెలెక్ట్ చేసుకోవాలనేది నిర్ణయం తీసుకోవచ్చు. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ, ఈపీఎఫ్, జీవిత బీమా ప్రీమియమ్స్, పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలైనవన్నీ లెక్కించిన తర్వాత.. సెక్షన్ 80సీ పరిమితి చేరుకునేందుకు ఇంక ఎంతమేర పొదుపు చేయాలనేది చూసుకోవాలి.
వాటి జోలికి పోవద్దు
పన్ను ఆదా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏలాంటివి ఎంచుకోవాలన్నది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అవసరం లేకున్నా అధిక ప్రీమియం ఉండే బీమా పాలసీల జోలికి పోవద్దు. పన్ను ఆదా అనేది బీమా పాలసీలు కల్పించే ఒక ప్రయోజనం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.
అంతే కానీ పూర్తిగా బీమా పాలసీలతోనే పన్ను మినహాయింపు పొందాలనుకుంటే మిగిలిన ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. ఖరీదైన పాలసీలు కాకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలను ఎంచుకోవచ్చు. ప్రీమియం అధికంగా ఉండే పాలసీలను తీసుకొని, ఆ తర్వాత ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి చేయవద్దు.
అవగాహన లేకపోతే..
పన్ను ఆదా పథకాల్లో తప్పనిసరి లాకిన్(కాల పరిమితి) వ్యవధి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు అందించే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) పెట్టుబడిని కనీసం మూడేళ్ల పాటు కొనసాగించాలి. బ్యాంకులో పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినప్పుడు అయిదేళ్ల పాటు వెనక్కి తీసుకోలేం. బీమా పాలసీలకు కూడా నిర్ణీత వ్యవధి ఉంటుంది. కాబట్టి, వ్యవధి గురించి అవగాహన లేకుండా పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు.. భవిష్యత్ లో వెనక్కి తీసుకోవాలన్నా కుదరదు.
ఆదా స్కీమ్స్ ఎంచుకునేటప్పుడు
పన్ను ఆదా పథకాల్లో రాబడి ఎంత వస్తుంది అనేవీ కూడా కీలకమైన అంశం. సురక్షిత పథకాల్లో పొదుపు చేసినప్పుడు రాబడి హామీ లభిస్తుంది. మార్కెట్ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు రాబడిపై కచ్చితమైన అంచనాలుండవు. కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలు 10-15 శాతం వరకూ రాబడినిస్తున్నాయి.
కొన్ని పథకాల్లో మదుపు చేసినప్పుడు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, వచ్చిన రాబడి/వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. కాబట్టి, పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు ఈ అంశాన్నీ గుర్తుంచుకోవాలి.
ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా
సురక్షితంగా ఉండే పొదుపు పథకాల్లో మాత్రమే పొదుపు చేస్తాం… అంటే పన్ను ఆదా అవుతుంది కానీ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూర్చుకోలేము. కాబట్టి, మీ ఆర్థిక స్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టేలా చూసుకోవాలి. మంచి పొదుపు, పెట్టుబడి పథకాల కలబోతగా మీ జాబితా ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది. పథకం ఎలాంటిదైనా పూర్తి అవగాహన లేకుండా దానిని ఎంచుకోవద్దు. మీకు స్పష్టత వచ్చాకే పెట్టుబడి నిర్ణయం తీసుకోండి.