South Central Railway: దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,973.14 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా ఆర్జించిన ఆదాయం అని సీనియర్ అధికారి సోమవారం తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే బృందం తన కార్యకలాపాల యొక్క అన్ని విభాగాలపై చురుకైన ప్రణాళిక మరియు అంకితభావంతో చేసిన ప్రయత్నాల మద్దతుతో, జోన్ 2022-23లో రూ. 18,973.14 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు 2018-19 ఆర్దిక సంవత్సరంలో అత్యధికంగారూ. 15,708.88 కోట్ల ఆదాయాన్ని పొందిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మీడియాకు తెలిపారు. గత ఏడాది ఈ జోన్ రూ.14,266 కోట్లు ఆర్జించింది.
సరుకు రవాణాతో పెరిగిన ఆదాయం..(South Central Railway)
గూడ్స్ షెడ్ అభివృద్ధి, టారిఫ్ మరియు నాన్ టారిఫ్ ప్రోత్సాహక చర్యల అమలు వంటి కార్యక్రమాలతో సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి జోన్ చురుకైన కార్యక్రమాలను చేపట్టిందని జైన్ తెలిపారు. దీని ఫలితంగా రైల్వే కొత్త ట్రాఫిక్ సంపాదించిందని ఆయన చెప్పారు. 131.854 మిలియన్ టన్నులు సరుకు రవాణా చేసి రూ. 13,051.10 కోట్ల ఆదాయాన్ని సాధించిందని ఆయన చెప్పారు. గతంలో 2018-19లో 122.5 మిలియన్ టన్ను సరుకు రవాణాతో రూ. 10,954.69 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే 2022-23లో ప్రయాణీకుల ద్వారా రూ. 5,140.70 కోట్లు ఆదాయం పొందింది. 2021-22లో 127.4 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించగా 2022-23లో వీరి సంఖ్య 255.59 మిలియన్లకు చేరింది.
విద్యుదీకరణలో రికార్డు..
2021-22లో 344 కిమీలతో పోలిస్తే 2022-23లో రికార్డు స్థాయిలో 384.42 కిమీ ట్రాక్ కొత్తగా జోడించబడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 50.015 కి.మీ కొత్త లైన్లు జోడించగా, 151.486 కి.మీ డబుల్ లైన్ మరియు 182.915 కి.మీ మూడో లైన్లు రైలు నెట్‌వర్క్‌కు జోడించబడ్డాయి.విద్యుదీకరణకు సంబంధించి, 2022-23 మధ్య కాలంలో = 1,016.9 కి.మీల విద్యుద్దీకరణ జరిగి జోన్‌లో రికార్డు సృష్టించినట్లు జైన్ చెప్పారు. ఇది ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా జోన్ సాధించిన అత్యధిక విద్యుదీకరణ మాత్రమే కాదు, భారతీయ రైల్వేలలో గత ఆర్థిక సంవత్సరంలో ఏ జోన్ సాధించని అత్యధిక విద్యుదీకరణ అని జైన్ పేర్కొన్నారు.