Nayara Energy: ప్రైవేటు రంగ చమురు సంస్థ ‘నయారా ఎనర్జీ’ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇచ్చే ధర కంటే రూ. 1 తక్కువకే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలసుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్‌ను రూ. 1 తక్కువకే విక్రయిస్తామని రిలయన్స్- బీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నయారా కూడా 1 తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మార్కెట్ వాటాను పొందేందుకు(Nayara Energy)
ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు.. గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆయా సంస్థలు రేట్లలో మార్పు చేయలేదు. ప్రస్తుతం రేట్లు దిగివచ్చినా.. అప్పటి వచ్చిన నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి.
దేశ వ్యాప్తంగా 6,376 పెట్రోల్ పంపులు
మరో వైపు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ధరలు స్థిరంగా ఉంచడంతో ప్రైవేటు రంగ కంపెనీలు నష్టాలు భరించలేక అధిక ధరకు ఇన్నాళ్లు ఆయిల్ ను విక్రయించాయి. దీంతో మార్కెట్ వాటాను కోల్పోయాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో.. తమ మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే సుపీరియర్ క్వాలిటీ డీజిల్‌ను మాత్రమే రూ. 1 తక్కువకు విక్రయిస్తున్నట్టు రిలయన్స్-బీపీ ప్రకటించింది.
పఅయితే పెట్రోల్, డీజిల్ రెండింటినీ రూ. 1 తగ్గించి విక్రయిస్తామని ఇపుడు నయారా ప్రకటించింది. దేశంలో మొత్తం 86,925 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అందులో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలవి 78,567 ఉన్నాయి. రిలయన్స్ బీపీకి 1,555 పెట్రోల్ బంకులు ఉండగా.. నయరా ఎనర్జీకి దేశ వ్యాప్తంగా 6,376 పెట్రోల్ పంపులు ఉన్నాయి. 7 శాతం వాటా ఉంది.