HDFC Bank-HDFC Merger: భారత దేశ చరిత్రలో అతి పెద్ద విలీనం జరిగింది. శనివారం నాడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అయింది. దీంతో ప్రపంచంలోని అతి పెద్ద విలువైన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నాలుగవ స్థానంలో నిలుస్తుంది. రెండు సంస్థల విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్ల సంఖ్య 120 మిలియన్‌లకు చేరుతుంది. ఒక విధంగా చెప్పాలంటే జర్మనీ జనాభా కంటే ఎక్కువ మంది కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ లో ఉంటారని చెప్పుకోవచ్చు.
ఈ రెండు సంస్థ విలీనం తర్వాత స్టాక్ మార్కెట్ లేదా సెన్సెక్స్‌లో దీని వెయిటెజ్ సుమారు 14 శాతం ఆక్రమిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్ల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ర్టీ వెయిటేజీ 10.4 శాతం వరకు ఉంది. దీంతో పోల్చుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెయిటేజీ మరింత పెరుగుతుంది. విలీనం తర్వాత హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్ పీఎల్‌సీ, సిటి గ్రూపు ఐఎన్‌ని మించిపోతుంది. అలాగే దేశీయ బ్యాంకులైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులను దాటిపోతోంది. కాగా ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ 62 బిలియన్ డాలర్లు కాగా.. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ గత నెల 22 తేదీన 79 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం తర్వాత దీనికి మార్కెట్ క్యాప్ ఏకంగా 170 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుంది.
విలీనం తరువాత ఏం జరుగుతుందంటే..(HDFC Bank-HDFC Merger)
ఇక విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వివిధ రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తెస్తుంది. బ్యాంకింగ్ సేవల నుంచి బీమా, మ్యూచువల్ ఫండ్‌లను బ్యాంకు అనుబంధ సంస్థల ద్వారా కొనసాగిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోనే హోంలోన్ ప్రాడక్టులను అందుబాటులో ఉంచుతుంది. విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చేరే అనుబంధ సంస్థల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లిమిలెడ్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ ఇర్గో జనరల్ ఇన్స్యూరెన్స్‌కంపెనీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వయిజర్స్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ లైప్ ఇన్సూరెన్స్‌కంపెనీ లిమిటెడ్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం అవుతాయి.
విలీనం పూర్తయిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు కేటాయిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ 25 షేర్లు ఉంటే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 42 షేర్లు కేటాయిస్తారు. కాగా ఈ నెల 13 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు స్టాక్ డీలిస్ట్ అవుతాయి. ఈ లోగా వాటాదారుల డీమాట్ ఖాతాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు బదిలీ చేయడం జరుగుతుంది. ఇక నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఉద్యోగులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగుల కిందికి వస్తారు. విలీనం తర్వాత ఎహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 1.77 లక్షలకు చేరుకుంటుంది. బ్యాంకు నెట్‌వర్కు బ్రాంచీల సంఖ్య 8,300కు చేరుతుంది. విలీనం తేదీ ప్రకటించిన తర్వాత గత రెండు మూడు రోజుల నుంచి ఈ రెండు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్ బ్రోకర్ల సమాచారం ప్రకారం ప్రస్తుతం 1,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్న ఈ షేరు త్వరలోనే 2,300 రూపాయలు దాటిపోతుందని చెబుతున్నారు.