Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించి నూతన పన్ను విధానం 2023-24 .. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే
కొత్త పన్ను విధానం ఏం చెబుతోంది(Income Tax)
ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివాళ్లు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్‌లో రూ. 12,500 నుంచి రూ. 25,000కి పెంచింది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం దేశంలో నివాసం ఉంటున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఎన్నారైలు, హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు ఈ పన్ను రాయితీ కిందకు రారు.
జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్‌లో రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది.
ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది.
2023 బడ్జెట్‌లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో మార్పుల ఫలితంగా ఉద్యోగులు,
పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షల వరకూ ఉంటే.. ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది.
మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారనే విషయంలో గందరగోళానికి గురికావద్దు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు.
అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.