HDFC Data leak: ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకై నట్టు తెలుస్తోంది. వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి సంబంధించి 7.5 జీబీ డేటా లీకైంది. ఓ హ్యాకర్ సదరు డాటాను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేయడంతో పాటు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా చేశాడు.
డౌన్ లోడ్ చేసుకునేలా(HDFC Data leak)
ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు.
పైగా అందులో ఎలాంటి పేమెంట్ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపాడు. లీక్ అయిన డేటాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల పూర్తి పేర్లు , పుట్టిన తేదీలు, వయసు,
కస్టమర్ల ఫొన్ నెంబర్లు , పర్సనల్ ఈ మెయిల్ ఐడీ, ఇంటి అడ్రస్ లు,
పిన్ కోడ్స్, ఎంప్లాయిమెంట్ స్టేటస్, రుణ సమాచారం, లావాదేవీలు, క్రెడిట్ స్కోర్లు… ఇలా మొత్తం సమాచారం ఉన్నట్టు హ్యాకర్ తన పోస్ట్ లో తెలిపాడు.
అదే విధంగా కొన్న డేటా శాంపిల్స్ కూడా పోస్ట్ చేశాడు.
వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల ఖాతా నెంబర్స్, కస్టమర్ ఐడీలు, పాస్ వర్డ్ లు, పిన్ నెంబర్లు మినహా వారి పేర్లు, అప్లికేషన్ స్టేటస్ తదితర వివరాలన్నీ కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కూడా డౌన్ లోడ్ చేసుకునేలా వీలు ఉంది.
యాక్సస్ చేసే అవకాశమే లేదు
అయితే డేటా గల్లంతుపై వస్తున్న కథనాల్ని హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) యాజమాన్యం కొట్టిపారేసింది. ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి వివరణ కోరింది.
ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు.
చాలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస‍్థ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ డేటాను వేరేవాళ్లు యాక్సస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా సంబంధిత వ్యవస్థను ఎప్పుడూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.