Byjus: ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ భారీ ఎత్తున వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా 40 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం జూన్ 5 తుది గడువు కాగా.. సకాలంలో వడ్డీ చెల్లించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
సకాలంలో చెల్లించకపోతే..
బైజూస్ ఒక వేళ 40 మిలియన్ డాలర్ల వడ్డీని సకాలంలో చెల్లించక పోతే.. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఎగవేసినట్టు అవుతుంది. దీనిపై ఇప్పటి వరకు బైజూస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కరోనా సమయంలో బైజూస్ కార్యకలాపాలు భారీగా విస్తరించాయి. అయితే, సంక్షోభం తగ్గిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారాయి. దీంతో బైజూస్ కంపెనీ ఆదాయం ఒక్క సారిగా తగ్గి పోయింది.
దీంతో రుణాల చెల్లింపులు సందిగ్ధంలో పడ్డాయి. వెంటనే బైజూస్ రుణదాతల బృందంతో చర్చలు జరిపింది. రుణ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించాలని కోరింది. కానీ, ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్రస్తుతం 40 మిలియన్ డాలర్ల వడ్డీని సకాలంలో కడితేనే, మరింత మూలధనాన్ని సమీకరించుకునేందుకు కంపెనీకి అవకాశం ఉంటుంది. తద్వారా కార్యకలాపాలను యధావిథిగా సాగించేందుకు సమయం ఉంటుంది. లేదంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు అంటున్నారు.