Affordable Homes: దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇళ్ల నిర్మాణాలు.. కారణమేమిటి ?

దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.

  • Written By:
  • Publish Date - May 27, 2024 / 05:38 PM IST

Affordable Homes:దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.

భూమి విలువ పెరగడం..(Affordable Homes)

డెవపర్లు అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల నిర్మాణాలను పక్కనపెట్టి వాటి స్థానంలో లగ్జరీ ప్లాట్స్‌పై పోకస్‌ పెట్టారని ప్రాప్‌ ఈక్విటీ తాజా నివేదికలో వెల్లడించింది. గత గత ఏడాది ఇదే జనవరి – మార్చితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరి నుంచి మార్చినెలలో నిర్మాణాలు 38 శాతం తగ్గి 33,420 యూనిట్లకు దిగివచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ల్యాండ్‌ విలువ పెరిగిపోవడంతో పాటు నిర్మాణరంగంలో వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. లాభాల మార్జిన్‌ తగ్గిపోవడంతో అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణానికి డెవలపర్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రాప్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఏడాది క్రితం ఇదే జనవరి మార్చిలో డెవలపర్లు 53,818 యూనిట్లు నిర్మిస్తే.. ఈఏడాది జనవరి – మార్చి నెలలో 33,420 యూనిట్లు మాత్రమే నిర్మించారు. ఇక దేశంలోని ప్రధానమైన ఎనిమిది నగరాల విషయానికి వస్తే ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోలకతా, పూనే, అహ్మాదాబాద్‌ నగరాలు ఆక్రమించాయి. అయితే గత ఏడాది నుంచి అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అదే జోరు ఈ ఏడాది కూడా కొనసాగింది.

గత ఏడాది అంటే 2023లో అందుబాటు ధరల ఇళ్ల విషయానికి వస్తే ఎనిమిది నగరాల్లో కలిపి మొత్తం 179,103 యూనిట్ల ప్రారంభించారు. అదే 2022తో పోల్చుకుంటే 20 శాతం క్షీణించింది. 2022లో ఏకంగా 224,141 యూనిట్ల ఆవిష్కరణలు జరిగాయని ప్రాప్‌ ఈక్విటీ సీఈవో, ఎండీ సమీర్‌ జాసుజా చెప్పారు. అయితే నిర్మాణాలు తగ్గడానికి పలు కారణాలు చెప్పారు. గత రెండేళ్ల నుంచి నిర్మాణంరంగం ఖర్చు 500 నుంచి 100 శాతం పెరిగిపోవడంతో లాభాల మార్జిన్‌ బాగా తగ్గిందని డెవలపర్లు చెప్పారని సమీర్‌ జాసుజా వివరించారు. ఇదే ఒరవడి కొనసాగితే మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారి సొంతింటి కల నెలవేరదు.భవిష్యత్తులో కష్టాలు తప్పవంటున్నారు రియల్‌ రంగానికి చెందిన నిపుణులు.