Adani Stocks Surge: లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ అదానీ గ్రూపు షేర్లపై పడింది. ఎందుకంటే గతంలో జరిగిన లోకసభ ఎన్నికల తర్వాత అదానీ షేర్లు అమాంతంగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అదీ కాకుండా ప్రధాని మోదీ… అదానీ గ్రూపునకు వెనుకుండి సాయం అందిస్తున్నారన్న టాక్ కూడా వినపడుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడల్లా అదానీ షేర్లు ఎందుకు పెరుగుతున్నాయని తరచూ ప్రశ్నిస్తుంటారు.
రూ.17.51 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్ ..(Adani Stocks Surge)
ఇక శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్‌ల ట్రేడింగ్ సరళిని గమనిస్తే.. అదానీ గ్రూపునకు చెందిన అన్నీ షేర్లు తారాజువ్వలా దూసుకుపోయాయి. అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే ఏకంగా రూ.84,064 కోట్లకు ఎగబాకింది. దీంతో అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.17.51 లక్షల కోట్లకు చేరింది. కాగా శుక్రవారం నాడు జెఫరీస్ ఓ నోట్‌లో అదానీ గ్రూపు శరవేగంగా విస్తరణ బాట పడుతోందని, వచ్చే దశాబ్దకాలానికి 90 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయబోతోందని వెల్లడించింది. దీంతో బీఎస్‌ఈలో గ్రూపునకు చెందిన షేర్లు దూసుకుపోయాయి. శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.1.23 లక్షల కోట్ల సంపదను సమకూర్చి పెట్టిందా అదానీ గ్రూపు షేర్లు. మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువ రూ.84,064 కోట్లు పెరిగింది.
ఇక దేశంలోని అతి పెద్ద బ్రోకేజీ సంస్థలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీల షేర్లను బై అంటే కొనుగోలు చేయవచ్చునని సలహా ఇచ్చాయి. అదానీ గ్రూపు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తమ కంపెనీల వార్షిక రిపోర్టులో వెల్లడించారు. కాగా నిన్న స్టాక్ మార్కెట్ ముగిసే సమయంలో అదానీ గ్యాస్ కూడా లాభాలతో ముగియడం విశేషం.. మొత్తానికి ఇన్వెస్టర్లు అదానీ గ్రూపులో షేర్లలోఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను ఆర్జించవచ్చుననే బ్రోకరేజీ సంస్థల అంచనా.