Site icon Prime9

Maruti Suzuki: వచ్చేనెల నుంచి పెరగనున్న ఆ కార్ల ధరలు

Maruti Suzuki

Maruti Suzuki

Maruti Suzuki: దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ నుంచి అన్ని రకాల కార్ల ధరలు ఏప్రిల్ నుంచి పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. నియంత్రణాపరమైన చర్యలు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలోనే ధరల్ని సవరించాల్సి వస్తోందని పేర్కొంది. అయితే, ధరలు ఎంత మేర పెంచనున్నారనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

వినియోగదారులపై  భారం(Maruti Suzuki)

తయారీ వ్యయాల్ని నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని మారుతీ సుజుకీ తెలిపింది. అయినా.. కొంత భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని పేర్కొంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని వెల్లడించింది. ఇప్పటికే హోండా కార్స్‌, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌ సైతం ఏప్రిల్ నెల నుంచి ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మారుతి సుజుకి కార్ల ధరలు పెంచడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఇన్ ఫుట్ వ్యయం పెరిగిపోయిందన్న పేరుతో మారుతి సుజుకి గత జనవరి 16న అన్ని రకాల కార్ల ధరలు1.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే.

 

బీఎస్ 6 ఫేస్ 2 దశలో భాగంగా

కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్ 6 ఫేస్ 2 దశ కర్బన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తయారీలో మార్పులు చేయాల్సి ఉంది. ఏప్రిల్ 1 నుంచి వాహనాల తయారీ సంస్థలు ఈ మార్పులు చేయాల్సి ఉంది. బీఎస్‌ 6-2.0గా పిలుస్తున్న ఈ దశలో ఆటోమొబైల్‌ తయారీ కంపెనీలు ‘రియల్‌ డ్రైవింగ్ ఎమిషన్‌ (RDE)’ ప్రమాణాలను తప్పక పాటించాలి. ఈ నేపథ్యంలోనే చాలా సంస్థలు ధరల్ని పెంచుతున్నాయి.

 

హోండా అమేజ్‌ కూడా

వచ్చే నెల నుంచి మారనున్న కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా ఉత్పాదక వ్యయం పెరుగుదల ప్రభావాన్ని అధిగమించేందుకు హోండా కార్ప్‌ ఇండియా తన ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ ధరలను రూ. 12,000 వరకు పెంచాలని యోచిస్తోంది. మోడల్‌ వివిధ ట్రిమ్‌లను బట్టి ధర పెరుగుదల మారుతూ ఉంటుందిని తెలిపింది. సెడాన్‌ సిటీ ధరలను మార్చడం లేదని కంపెనీ పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar