Prime9

Chevireddy Stopped in Airport: ఎయిర్ పోర్ట్ అధికారుల నిర్బంధంలో చెవిరెడ్డి..! విజయవాడకు తరలింపు.!

Chevireddy Stopped in Bangalore Airport: వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు బెంగుళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. మద్యం కేసులో ఇప్పటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీఅయ్యాయి.  దేశం విడిచి చెవిరెడ్డి పారిపోతున్నారన్న సమాచారంతో  విజయవాడ నుంచి బెంగళూరుకు సిట్ బృందం చేరుకుంది. అక్కడే  చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురానున్నారు. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితునిగా సిట్ చేర్చింది. ఎఫ్ఐఆర్‌లో ఏ38గా పేర్కొంటూ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. చెవిరెడ్డి.. బెంగళూరు ఎయిర్ పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్భందంలో ఉన్నారు. చెవిరెడ్డిపై లుక్‌అవుట్ సర్క్యూలర్ ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించారు.

 

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే గన్‌మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్‌మెంట్లు ఇవ్వాలని సిట్‌ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. తప్పుడు స్టేట్‌మెంట్లతో తన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని లిక్కర్‌ కేసులో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడబోమని మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

Exit mobile version
Skip to toolbar