ఎలాన్ మస్క్ : ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తొలగిపోతాను… కానీ ఆ తర్వాతే: ఎలాన్ మస్క్

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 10:23 AM IST

Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ లో ఉన్న ఎలాన్ మస్క్ అనూహ్య రీతిలో ట్విట్టర్ ను కొనుగోలు చేసి అందరిని విస్మయానికి గురి చేశారు. కాగా ఆ తర్వాత తనదైన నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లకు రోజుకో ట్విస్ట్ ఇస్తూ వచ్చారు. బ్లూ టిక్ విషయంలో, అకౌంట్ లను తొలగించడం, ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు. అయితే రెండురోజుల క్రితం మస్క్ ఓ ఆసక్తికరమైన పోల్‌ను ట్విటర్‌లో పోస్టు చేశాడు. తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా? వద్దా అనే విషయంపై ఓటు చేయాలని నెటిజన్లకు సూచించారు.

కాగా మస్క్‌కు ట్విటర్‌ యూజర్లు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. దానికి సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. ఐతే దాదాపు 10 మిలయన్లకు పైగా (57.5 శాతం) మంది మస్క్‌ను ట్విటర్‌ సీఈవో నుంచి వైదొలగవల్సిందిగా కోరారు. ఇక 42.5 శాతం మంది సీఈవోగా కొనసాగడం తమకు అంగీకారమేనని ఓటు వేశారు. ఫలితాలు ఏ విధంగా వచ్చినా దానికి కట్టుబడి ఉంటానని చెప్పిన మస్క్‌ తీరా పోల్‌ ఫలితాలు వచ్చాక సైటెంట్‌ అయిపోయాడు.

అయితే తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే సీఈవోగా అందుకు తగిన వేరే వ్యక్తి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ మస్క్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఇప్పుడు మస్క్ పెట్టిన పోస్ట్ లు ట్రెండింగ్ గా మారాయి.