Parliament Budget Sessions to starts from January 31 to April 4: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి.
బడ్జెట్‌పై మధ్యతరగతి ఆశలు..
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈ సారి బడ్జెట్‌పై మధ్య తరగతి ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు ఇప్పటికే కేంద్రానికి సూచించిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల కోసం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విధి విధానలపై బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం.