Former Tamil Nadu DGP: మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్ కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. విల్లుపురం కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి పది వేల జరిమానా కూడా కోర్టు విధించింది. 2021 ఫిబ్రవరిలో సీనియర్ అధికారిపై మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు నమోదు చేశారు. సీఎం పళనిస్వామికి భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సీనియర్ ఆఫీసర్ అనుచితంగా వ్యవహరించినట్లు ఆ మహిళా ఆఫీసర్ ఫిర్యాదు చేశారు.
68 మంది నుంచి వాంగ్మూలం..(Former Tamil Nadu DGP)
అన్నా డీఎంకే ప్రభుత్వం రాజేశ్ దాస్‌ను సస్పెండ్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఆరుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు సమయంలో సుమారు 68 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో అప్పీల్ చేసుకోవచ్చు అని ప్రాసిక్యూషన్ బృందం పేర్కొన్నది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ అంశం కీలకంగా మారింది. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంకే స్టాలిన్ కూడా హామీ ఇచ్చారు.