TG High Court: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. జరిగిన ఘటనపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. అండగా ఉండాలని కోరారు. అయితే ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై హైకోర్టులో నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలి..
టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగినా ఇప్పటి వరకు సహాయ చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తం అయిందని, సహాయక చర్యలను ముమ్మరం చేసిందని కోర్టుకు విన్నవించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతోపాటు ఆర్మీ, సింగరేణి బృందాలు 24 గంటలకు కష్టపడుతున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితోపాటు ఇరిగేషన్ మంత్రి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హైకోర్టుకు విన్నవించారు. అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాలను ధర్మాసనం నోట్ చేసుకుని విచారణ ముగిస్తున్నట్లగా ప్రకటించింది.