మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం
AICC: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో ఆదివారం మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో కుల గణన చేసినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొంతమంది నేతలు కుల గణన సరిగా జరగలేదని, తమ సంఖ్యను తగ్గించినట్లుగా అభిప్రాయపడ్డారు.
ఏఐసీసీ సీరియస్..
కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ భేటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కులగణనన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర పార్టీల నేతలను పిలిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం తర్వాత ఏఐసీసీ స్పందనకు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని, పార్టీ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం సందేశం పంపినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు : వీహెచ్
ఏఐసీసీ సందనపై వీహెచ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. బీసీ కులగణననకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సహకరిస్తామన్నారు. త్వరలోనే సీఎం అపాయింట్‌మెంట్ కోరుతున్నామని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే మాట్లాడి మున్నూరుకాపు సభ ఎప్పుడు నిర్వహించాలనేది చెబుతామన్నారు. పార్టీలో ఒకరిద్దరు నేతలు తనపై కోపంగా ఉండొచ్చు.. కానీ తాను పార్టీకి చెడు చేయనని ఈ సందర్భంగా వీహెచ్ తేల్చి చెప్పారు.