Site icon Prime9

Vijayashanti: తెలంగాణ ఎన్నికలు.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి దక్కని చోటు

Vijayashanti

Vijayashanti

Vijayashanti: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అగ్ర నాయకులు ప్రచారానికి రానున్నారు.

పార్టీ మారుతున్నారనే..(Vijayashanti)

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో విజయశాంతికి మాత్రం చోటు దక్కలేదు. ఇదే అంశంపై ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ వంటి నేతలకు అవకాశం దక్కింది. విజయశాంతి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా అధిష్టానం పట్టించుకోలేదు. పార్టీ మారుతున్నారనే ప్రచారంతో రాములమ్మను అధిష్టానం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

2018లో కేసీఆర్ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ బలహీన పడిందని, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా బీజేపీ కే ఉందని వారు భావించారు. తదనంతర పరిణామాలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరు కూడా ఆ పార్టీపై ఆశలను మరింత పెంచింది. అయితే హఠాత్తుగా బండి సంజయ్ ను పదవి నుంచి తొలగించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడలేదు. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాములో ఉన్నప్పటికీ ఆమెను అరెస్ట్ చేయలేదని దీనికి బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య లోపాయికారీ సంబంధం ఉండటమేనంటూ కాంగ్రెస్ విమర్శలకు దిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ పై గట్టిగా వ్యవహరించలేకపోవడం, కేంద్ర నేతలు తమకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో చాలా కాలంగా పలువురు నేతలు బీజేపీపై అసంతృప్తి తో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. విజయశాంతి, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 

 

Exit mobile version
Skip to toolbar