Adilabad RIMS: అదిలాబాద్ రిమ్స్‌లో రాత్రి వైద్య విద్యార్థులను బయటి వ్యక్తులు వచ్చి కొట్టడాన్ని నిరసిస్తూ రిమ్స్ విద్యార్థులు ప్రధాన గేట్ ముందర ధర్నాకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తమ వార్డుల్లో సరైన సదుపాయాలు లేవని నిన్న సాయంత్రం డైరెక్టర్‌తో గట్టిగా మాట్లాడితే ఇలా రౌడీలను తీసుకువచ్చి దాడులు చేపియిస్తారా అని బాధితుడు కవిరాజు నిలదీశారు.
రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు..(Adilabad RIMS)
బుథవారం రాత్రి పదకొండున్నర గంటలకు రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కర్రలు, క్రికెట్ బ్యాట్‌లతో తనపై దాడి చేశారన్నారు. ఎందుకు దాడి చేస్తున్నారని అడిగితే క్రాంతిపై ఎదురుతిరిగి మట్లాడినందుకు దాడి చేస్తున్నామన్నారన్నారు.వైద్య కళాశాలలో రౌడీయిజాన్ని ప్రోత్సహించిన డైరెక్టర్‌ను, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట వైద్యవిద్యార్థులు ధర్నాకు దిగారు. ఇలా ఉండగా రిమ్స్‌లో అర్ధరాత్రి కలకలం రేపిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ రిమ్స్ ఘటనపై ఆరా తీసారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని దీనికి సంబంధించి తనకు నివేదికను అందజేయాలని సూచించారు.