Mulugu: ఐఏఎస్ అధికారులుగా అభివృద్ధికి పాటుపడాల్సిన కొందరు కలెక్టర్లు కూడా సాధారణ పౌరులుగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సాధారణ వ్యక్తిలా స్పందించి వివాదంలో చిక్కుకున్నారు.తన వాహనానికి గేదెలు అడ్డొచ్చాయని పాడి రైతుకు ఫైన్ విధించి వార్తల్లో కెక్కారు.
ములుగు జిల్లా గంపోని గూడెం గ్రామానికి చెందిన బోయిని యాకయ్య అనే రైతు తన గేదెలను మేపేందుకు గానూ పొలం వద్దకు తోలుకెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి గేదెలు అడ్డుగా వచ్చాయి. డ్రైవర్ ఎంత సేపు హారన్ కొట్టినా గేదెలు అడ్డుతొలగలేదు. దీంతో కలెక్టర్ పశువల కాపరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాకయ్య ఫై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలను కింద స్థాయి అధికారులు అమలు చేశారు. హరితహారంలో నాటిన మెుక్కలను పశువులు నాశనం చేస్తున్నాయంటూ సదరు రైతు యాకయ్యకు రూ.7,500 ఫైన్ విధించారు. జరిమానా డబ్బు కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన పశువులు మెుక్కలను తినకున్నా.. ఫైన్ విధించారని వాపోయాడు. అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని.. ఇంటి నల్లా కనెక్షన్‌కు సీల్ వేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొందరు రైతులతో కలిసి ధర్నాకు దిగాడు.