Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు.. సుత్తి, రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌మ్యాన్‌కు గాయాలయ్యాయి.
స్ట్రాంగ్ రూము వద్ద..(Pulivarthi Nani)
ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్ర గిరి నియోజకవర్గం ఈవీఎం లు భద్రపరిచిన తిరుపతి లోని పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్ట్రాంగ్ రూము వద్ద ఈవీఎంలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మని ప్రసాద్ అలియాస్ నాని అక్కడికి చేరుకున్నారు .ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడ భారీగా ఉండటం చూసిన నాని వారిని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో వారు ఒక్కసారిగా నానిపై దాడికి పాల్పడ్డారు.నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్‌మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు.