Site icon Prime9

Prashant Kishor: సీఎం జగన్ పై ’పీకే‘ అసంతృప్తి ఎందుకు?

PK

PK

Prashant Kishor -YS Jagan: ఇన్నాళ్లూ ఎంతో క్లోజ్‌గా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌కు, ఏపీ సీఎం జగన్‌కు మధ్య గ్యాప్‌ పెరిగిందా? ఎక్కడ చెడింది వీరిద్దరికి? జగన్‌కు వ్యతిరేకంగా పీకే కామెంట్స్‌ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?ఇంతకీ జగన్‌మీద ప్రశాంత్‌కిశోర్‌కు ఎందుకు కోపం వచ్చింది? జగన్ పదవీకాంక్షకు సాయపడ్డానని పీకే చెప్పడం ఏమిటి? సీఎం జగన్ పై ’పీకే ‘ అసంతృప్తి ఎందుకు?

ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఉన్నారంటే అది మాస్టర్‌మైండ్‌ పీకే వల్లే అని చెప్పొచ్చు. 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారన్నా, 22 మంది లోక్‌సభ సభ్యులను కైవసం చేసుకున్నారన్నా, దీని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ 67 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇది ఆయనకు అప్పట్లో గట్టి దెబ్బగా వైసీపీ నాయకులు భావించారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి కావాలని భావించిన జగన్‌ మోహన్‌రెడ్డికి ఇది తీవ్ర అవమానకర పరిణామం అన్న చర్చ కూడా సాగింది.

ఈ నేపథ్యంలోనే జగన్‌ తన ప్రయోగాలు, తన వారి ప్రయోగాలతో పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని గ్రహించారు. వెంటనే అప్పటికి మంచి ఫాంలో ఉన్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదించారు. అప్పటికే ఆయన బీజేపీ తరఫున పనిచేశారు. `చాయ్ పే చర్చ` వంటి వినూత్న ప్రచారంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని పీఠం పై కూర్చోబెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు పీకే. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆయనను ఆశ్రయించి ఆయన కనుసన్నల్లోనే పార్టీని ముందుకు నడిపించారు. ఈ డీల్ ఖరీదు 350 కోట్లని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల అఫిడవిట్లో వైసీపీ చేసిన ఎన్నికల ఖర్చును పేర్కొంటూ పీకేకు 37 కోట్ల 17 లక్షల రూపాయలను ఫీజుకింద ఇచ్చినట్టు జగన్ పేర్కొన్నారు. ఇక పీకే చెప్పినట్టే నవరత్నాలు, పాదయాత్ర వంటివి చేసి జగన్ గెయిన్ అయ్యారు. అంతేకాదు సీఎం అయిన తర్వాత జగన్ పీకే బృందానికి ఖరీదైన కానుకలు ఇచ్చి సాగనంపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సీఎం అయిన తర్వాత పాలన ప్రారంభించిన తర్వాత కూడా జగన్‌తో ఒకసారి అధికారికంగానే పీకే వచ్చి తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్షాల దూకుడుకు ఎలా అడ్డుకట్టవేయాలనే అంశం పైనా చర్చ జరిగినట్టు లీకులు వచ్చాయి. ఆ తర్వాత వీరి సమావేశం జరగలేదనే చెప్పాలి. ఇక ఇప్పటికీ పీకే బృందం ఐప్యాక్‌తో జగన్ సావాసం చేస్తూనే ఉన్నారు. వారినే నియోజకవర్గాల్లో తిప్పుతున్నారు. ఐప్యాక్ చెప్పిందే వేదంగా భావిస్తున్నారు. మరి ఇంతగా పాలు తేనె మాదిరిగా కలిసిపోయిన పీకే-జగన్ మధ్య ఇప్పుడు ఏం జరిగింది? అనేది చర్చ కు వస్తోంది. `జగన్‌కు సాయం చేసే కన్నా, ఆ సమయంలో కాంగ్రెస్‌కు చేసి ఉంటే బాగుండేది`అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జన్ సురాజ్ పాదయాత్ర చేస్తున్న పీకే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్‌కు సాయం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇటీవల పీకే తన పాదయాత్రకు నిధులు ఇస్తున్నది తన పాత క్లయింట్లేనని వ్యాఖ్యానించారు. వీరిలో ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నారని చెప్పారు. అయితే తాను అడిగినంత జగన్ ఇచ్చి ఉండకపోవడం వల్లే పీకే అలా వ్యాఖ్యానించారా? లేక బీజేపీని వ్యతిరేకిస్తున్న తనకు మద్దతుగా జగన్ ఒక్క ప్రకటనా చేయకపోవడం. ఢిల్లీలో బీజేపీకి పరోక్షంగా ఆయన మద్దతు ఇస్తున్నారనే భావన పీకేకు ఉందా? లేకపోతే ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం అనేది ఉందని, బీజేపీని నిలవరించాలంటే కాంగ్రెస్ బలంగా ఉండాలని పీకేకు ఇపుడే తెలిసిందా? అసలు కాంగ్రెస్ లో చేరాలని భావించి మరలా పీకే పక్కకు తప్పుకున్న విషయం కూడ అందరికీ తెలిసిందే కదా. పొలిటీషియన్స్ డబ్బులు ఇస్తే పీకే వ్యూహాలు ఇస్తారు. అంతవరకే. కాని నితీష్ కుమార్ ను, జగన్మోహన్ రెడ్డి పేర్లు మాత్రమే ఎందుకు ప్రస్తావించారు? తమిళనాట స్టాలిన్ కు, బెంగాల్లో మమతా బెనర్జీకి కూడ ఆయన సాయం చేసారు కదా. మరి వీటిపై క్లారిటీ ఇవ్వాల్సింది కూడ పీకేనే.

 

Exit mobile version
Skip to toolbar