Site icon Prime9

Guru Purnima: గురువులను పూజించే రోజు గురుపూర్ణిమ

Guru Purnima: గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఏడాది గురుపూర్ణిమ జూలై 13 బుధవారం నాడు వచ్చింది.

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఝాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. అంతే కాదు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

గురుపౌర్ణమి రోజున వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.పూర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తుంటారు. షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గురుపూజోత్సవం జరిపి గురువులను సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని భావిస్తారు. దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలను నివేదన కోసం ఉపయోగిస్తారు. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఆహారం తీసుకుంటారు.

Exit mobile version