Government lists 15 bills including Waqf bill for winter session of Parliament: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులతో సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రం వక్ఫ్ బిల్లుతో సహా 16 బిల్లులకు జాబితాను సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించిన తరువాత, ఉభయ సభల పరిశీలన, ఆమోదం కోసం వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లునూ జాబితాలో చేర్చటంతో ఈసారి సభలో సమరం తప్పదనిపిస్తోంది.
5 కొత్త బిల్లులు
ఈసారి ప్రభుత్వం రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లు, పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్టు బిల్లులను కొత్తగా సభలో ప్రవేశపెట్టనుంది. సభలో మెజారిటీ ఉంది గనుక ఉభయ సభల్లో వీటి ఆమోదం లాంఛనమేనని ప్రభుత్వం భావిస్తోంది.
వివాదాల వక్ఫ్ బిల్లు
అయితే ఈసారి అందరి దృష్టీ ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోన్న వక్ఫ్ బోర్డు బిల్లు మీదే ఉంది. గత వర్షాకాల సమావేశాల్లో దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టగా, తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిన సంగతి తెలిసిందే. కాగా, శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజున ప్యానెల్ తన నివేదికను సమర్పించడం తప్పనిసరి కావటంతో ఈసారి ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, దీనిపై వస్తున్న అభ్యంతరాల దృష్ట్యా వక్ఫ్ బిల్లును పరిశీలిస్తున్న జేపీసీ పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ బిల్లు విషయంలో రగడ జరిగే అవకాశం కనిపిస్తోంది.
మిగిలిన బిల్లులు ఇవే..
లోక్‌సభలో ప్రవేశపెట్టి, లోక్‌సభలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులనూ ఆమోదించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్విభజన బిల్లు, ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, సముద్రం నుంచి వస్తువులు తీసుకొచ్చే బిల్లు, రైల్వేస్ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లులున్నాయి. కాగా, ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెడతారని ఊహాగానాలు ఎక్కువగా వినిపించినా ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఇవిగాక, లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుతో బాటు రాజ్యసభలో ప్రవేశపెట్టి పెండింగ్‌లో ఉన్న బిల్లులైన చమురు క్షేత్రాల (నియంత్రణ అండ్ అభివృద్ధి) సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లులు ఈసారి చర్చకు రానున్నాయి.