Complaint Against Prabhas, Balakrishna and Gopichand in Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు మరో ముగ్గురు స్టార్ హీరోల మెడలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
వివరాల ప్రకారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్‌లతో పాటు ప్రముఖ యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రామారావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫిర్యాదులో పలు విషయాలు వెల్లడించాడు. తమ ఇష్టమైన హీరోలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేయడంతో వాటిని నమ్మిన చాలా మంది అభిమానులు, యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇటీవల టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండలపై కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేయడం చట్ట విరుద్ధమని, ఎవరైనా ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.