Sri Rama Navami : దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించారు శ్రీరాముడు. త్రేతాయుగంలో దశరథ, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు శ్రీ రాముడు జన్మించారు. హిందువులు ప్రతి సంవత్సరం చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమిగా పండగలా జరుపుకుంటారు. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున చేయాల్సిన పనులు ఏంటి.. చేయకూడని పనులు ఏంటి.. ఏ సమయానికి పూజ చేయాలో మీకోసం ప్రత్యేకంగా..
సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి పూజ మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. పూజ చేసే సమయంలో ఐదు వత్తులు వేసే విధంగా దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి.. తులసి మాలతో రాముడి విగ్రహాన్ని అలంకరించండి. అంతేకాదు పూజ చేసేవారు తులసి మాలను ధరించండి. పూజ పూర్తయిన తర్వాత నిరుపేదలకు అన్నదానం చేయండి. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి. శ్రీరాముడికి సంబంధించిన పుస్తకాలను పంచి పెట్టండి. తాంబూలం ముత్తైదువులకు ఇవ్వండి.
పూజ నియమాలు..
శ్రీరామ నవమి రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించాలి. శ్రీ రామ దేవాలయం దర్శించుకోవడం మేలు చేకూరుతుంది. సీతారాములకు పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే.. అనుకున్న పనులు జరుగుతాయి. సకల సంపదలు లభిస్తాయని విశ్వాసం. శ్రీరామనవమి రోజున రామదేవుని కథ వ్రతం ఆచరించడం అత్యంత ఫలవంతం. శ్రీరామ నవమి మర్నాడు శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించాలి. బియ్యం పాయసం చేసి బంధువులకు నిరుపేదలకు పెట్టండి. శక్తి కొలది నిరుపేదలకు దానం చేయండి.
శ్రీరామ నవమి రోజున చేయాల్సినవి..
రామ నవమి నాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేయాలి.
ఈ రోజున ఉపవాసం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.
పూజ సమయంలో దేవునికి అర్ఘ్యం సమర్పించండి.
రామచరిత మానస, రామ చాలీసా , శ్రీరామ రక్షా స్తోత్రాలను కలిసి పఠించండి.. రామ కీర్తనలు, భజనలు , స్తోత్రాలను నిరంతరం పఠించడం ఉత్తమం.
హనుమాన్ చాలీసా పఠించడం.. సాయం కోరిన వారికి, పేదలకు వీలైనంత దానం చేయండి.
శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున, ఈ సమయంలో రామనవమి పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
శ్రీరామ నవమి రోజున చేయకూడనివి..
మాంసం , ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి.
జుట్టును కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానుకోండి.
ఇతరులను విమర్శించవద్దు లేదా చెడుగా మాట్లాడవద్దు.
మీ భాగస్వామిని మోసం చేయవద్దు, ఎవరికీ ద్రోహం చేయవద్దు.
అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించండి..