Site icon Prime9

Krishnashtami :కృష్ణాష్టమి ప్రాముఖ్యత తెలుసుకోండి..

Krishnashtami

Krishnashtami: శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.

చిన్ని కృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి తరువాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందువలన కృష్ణుడి మెడలో తులసి మాలలు వేయాలి.కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పుష్పాలతో అర్చించాలి.కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం. అందువలన వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణపూజ చేస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి.

ఉట్టి సంబరం
కృష్ణాష్టమినాడు ఉట్టికొట్టే సంబరం యువతకు ఎంతో ఇష్టం. దీనిని నార్త్ ఇండయాలో దహి హండీ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు, చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి తరువాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి, పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగులగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దీనికోసం ఒకరిపైకి మరొకరు ఎక్కి పిరమిడ్ ఆకారంలో ఏర్పడితే వారిపై నుంచి వెళ్లిన వారు ఉట్టి పగులగొడతారు. వీరిపై మరికొందరు నీళ్లు చల్లుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ ఉట్టి సంబరాలు అందరినీ ఆకర్షిస్తాయి

కృష్ణాష్టమి సందర్బంగా దేశ్యవ్యాప్తంగా శ్రీకృష్ణుడి ఆలయాలు, ఇస్కాన్ దేవాలయాలు సర్వాంగసుందరగా తయారయ్యాయి. గోవర్దనగరిధారి, కాళియమర్దనుడు, శిష్టజన రక్షకుడు, గీతా ప్రబోధకుడు అయిన శ్రీకృష్ణుడి స్మరణతో కృష్ణాష్టమిని జరుపుకుందాం.

Exit mobile version