Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఏడు సెషన్ల నష్టాల నుంచి శుక్రవారం భారీ లాభాలతో విరామం తీసుకున్న మార్కెట్లు తిరిగి నేడు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడంతో క్రూడాయిల్ ధరలు 4 శాతం పెరిగాయి. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి.
సెన్సెక్స్ ఉదయం 57,403.92 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 638.11 పాయింట్ల నష్టంతో 56,788.81 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 207 పాయింట్లు కోల్పోయి 16,887.35 దగ్గర స్థిరపడింది. మరోవైపు ఆర్‌బీఐ రెపోరేటు పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో శుక్రవారం వచ్చిన ర్యాలీకి నేడు కొత్త సానుకూలతలేవీ జతకాలేదు. పైగా ఇటీవల కనిష్ఠాల నుంచి ముడి చమురు ధరలు దాదాపు 4 శాతం పెరగడం ఇన్వెష్టర్ల ఆందోళనకు కారణమైంది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అస్థిరతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు కూడా జతవ్వడంతో నష్టాలు తప్పలేదు.