OnePlus Foldable: గ్లోబల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్.. మడత పెట్టే స్మార్ట్ ఫోన్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో శామ్ సంగ్ గట్టి పోటీ ఇస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ల లో కస్టమర్లకు ఇప్పటి వరకు మార్కెట్‌లో లేని సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని వన్ ప్లస్ భావిస్తోంది.
ద్వితీయార్ధంలో విడుదల(OnePlus Foldable)
ఫోల్డబుల్ ఫోన్ ను 2023 ద్వితీయార్ధంలో తీసుకురానున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. బార్సిలోనాలో జరుగుతున్న ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’లో ఫ్యూచర్ ప్లాన్స్ ను వెల్లడించింది.
వన్‌ప్లస్ 11 విడుదల సందర్భంగానే కంపెనీ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన సంకేతాలు ఇచ్చింది.
వన్ ప్లస్ ఫోన్ లలో సాధారణంగా ఉండే ‘ఫాస్ట్ అండ్ స్మూత్’ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు అత్యున్నత ఫీచర్లను అందించాలను కుంటున్నామని వన్ ప్లస్ తెలిపింది.
డిజైన్, మెకానికల్ టెక్నాలజీ సహా అన్ని అంశాల్లో పరిశ్రమలో ది బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను అందించాలనేది కంపెనీ పేర్కొంది. కానీ, ఈ ఫోన్ గురించి వన్‌ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
పట్టుకోసం వన్ ప్లస్ ప్రయత్నాలు
బీబీకే యాజమాన్యంలోని ఒప్పోకు సబ్ బ్రాండ్‌గా ఉన్న వన్‌ప్లస్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పట్టుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్రాండ్‌కు ఉన్న విలువను మరింత పెంచుకునే ఆలోచనలో ఉంది.
ఈ క్రమంలోనే శామ్‌సంగ్, యాపిల్ వంటి వాటితో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో 81 శాతం మార్కెట్ వాటా శామ్‌సంగ్ సంస్థకు ఉంది.
ప్రస్తుతం ఈ ఫోన్ల విక్రయాలు స్వల్పంగానే ఉన్నా.. భవిష్యత్‌లో సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశంతోనే లబ్ధి పొందాలని వన్‌ప్లస్ ప్రణాళికలు రచిస్తోంది.