Citroen Basalt NCAP Crash Test: వీడియో.. సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV క్రాష్ టెస్ట్.. ఎన్ని పాయింట్స్ సాధించిందంటే?

Citroen Basalt NCAP Crash Test: దేశంలోని వాహన భద్రతా తనిఖీ సంస్థ ‘భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్’ (భారత్ ఎన్‌సిఎపి) కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని పరీక్షించింది. ఈ కారుకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32కి 26.19 పాయింట్లు సాధించింది. సిట్రోయెన్ కంపెనీ నుండి భారత్ NCAP టెస్ట్‌కు వచ్చిన మొదటి కారు కూడా ఇదే. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32కి 26.19 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49కి 35.90 పాయింట్లు సాధించింది. ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించగలిగింది.

భారత్ NCAP టెస్ట్‌లో సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV అత్యంత వేగంతో పెద్ద బారియర్‌ని ఢీకొట్టింది. ఈ కారులోని సేఫ్టీ ఫీచర్లు ప్రయాణికుల తల, మెడకు మరింత రక్షణ కల్పించాయి. అయితే ఛాతీ, కాళ్లకు ఆ మేరకు రక్షణ కల్పించలేకపోయారు.

ఈ సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV గరిష్ట సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. వాటిలో ప్రధానమైనవి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), పార్కింగ్ సెన్సార్లు.

ప్రస్తుతం దేశంలో కొనడానికి అందుబాటులో ఉన్న సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV ధర రూ. 7.99 నుండి రూ. 13.83 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది బసాల్ట్ 1.2P U, బసాల్ట్ ప్లస్, బసాల్ట్ టర్బో ప్లస్, బసాల్ట్ టర్బో AT ప్లస్, బసాల్ట్ టర్బో మాక్స్ వంటి వేరియంట్లను కలిగి ఉంది.

కొత్త కారులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది వేరియంట్‌లను బట్టి 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. ఇది 18 నుండి 19.5 kmpl మైలేజీని కూడా అందిస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV 5 మంది వరకు కూర్చోగలదు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.2-అంగుళాల), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (7-అంగుళాల), ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.