56000 ఏళ్ల చరిత్ర గల ఆ సరస్సు రాత్రికి రాత్రే తన రంగు మార్చుకుంది. ఆకుపచ్చరంగులో వుండే సరస్సు గులాబీ రంగులోకి మారిపోయింది. ఇది సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలను, ప్రకృతి ఔత్సాహికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ లోనార్ సరస్సు. వేల ఏళ్ల కిందట ఉల్కాపాతం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా దీన్ని జాతీయ భౌగోళిక వారసత్వంగా గుర్తించారు.
సాధారణంగా ఇది పచ్చని రంగులో ఉంటుంది. తాజాగా ఇది గులాబీ రంగులోకి మారిపోయింది. ఈ పురాతన సరస్సు దాదాపు 1.2 కి.మీ వ్యాసార్ధంతో, 78 హెక్టార్ల మేర విస్తరించి ఉంది. 56 వేల సంవత్సరాల కిందట ఉల్కాపాతం వల్ల ఈ బిలం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మధ్యప్రదేశ్లోని ధాలా, రాజస్థాన్లోని రామ్ఘర్లోనూ ఇలాంటి సరస్సులు ఉన్నాయి. అయితే.. ఇవి లోనార్ సరస్సుతో పోలిస్తే చిన్నవి. ముంబై నుంచి సుమారు 500 కి.మీ దూరంలో ఉన్న లోనార్ సరస్సు అందాలను వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు తరలి వస్తారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ సరస్సు రాత్రికి రాత్రే రంగు మారి కనిపించడంతో అటు శాస్త్రవేత్తలతో పాటు ప్రకృతి ఔత్సాహికుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
లోనార్ సరస్సు రంగు మారడంలో మానవ ప్రమేయం ఏమీ లేదని భూగోళశాస్త్ర నిపుణులు డాక్టర్ మదన్ సూర్యవంశీ తెలిపారు. సరస్సును పరిశీలించిన ఆయన కీలక వివరాలు తెలిపారు. సాధారణంగా నీటిలో ఉండే శిలీంద్రాల వల్ల సరస్సు నీరు ఆకుపచ్చ రంగులోకి మాత్రమే మారుతుందని.. ఇలా గులాబీ రంగులోకి మారడం లోనార్ బిలంలోని జీవవైవిధ్యం వల్లే జరగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
లోనార్ సరస్సులోని లవణీయత, ఆల్గే కారణం వల్లే ఇది గులాబీ రంగులోకి మారినట్లు నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ సరస్సు ఇలా రంగుమారడం ఇదే తొలిసారి కాదని సరస్సు సంరక్షణ అభివృద్ధి సభ్యులు గజానన్ ఖారత్ తెలిపారు. అయితే, తరచూ ఆకుపచ్చ రంగులోకి మారే ఈ సరస్సు.. ఈసారి మాత్రం గులాబీ రంగులోకి మారి మెరుస్తుండటం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.