కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో..తెలంగాణ కూడా దాదాపు రెండున్నర నెలలు లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునే నేపధ్యం లో తిరిగి సడలింపులు ఇస్తున్నారు. ఈ నేపధ్యం లో తెలంగాణాలో ఇప్పటివరకు ఆర్టీసీ కి అనుమతులు ఇవ్వలేదు. తాజాగా.. అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతులు ఇస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు.
అయితే.. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ముందుగా ఒప్పందాలు చేసుకున్న తర్వాతే... సర్వీసులు మొదలు పెడతామని కెసిఆర్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ విషయమై సీఎస్ సోమేష్ కుమార్ ఆయా రాష్ట్రాల సీఎస్లతో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ఓ నిర్ణయానికి వస్తారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ఆధారంగానే ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటకకు అంతర్రాష్ట బస్సులు నడిచాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలతో కొత్త ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణలో ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే... టీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా ఆ రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లు తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
అయితే.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు లాభాలొచ్చే రూట్లలో ఎక్కువ బస్సులు నడుపుతూ.. నష్టం వచ్చే రూట్లలో తక్కువ బస్సులు నడుపుతున్నట్లు గుర్తించారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కెసిఆర్ చెప్పారు. ఇది ఇలా ఉంటె.. మరో వైపు సిటీ బస్సులకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దని కెసిఆర్ అన్నారు. సిటీ బస్సులను అనుమతిస్తే.. వ్యాధి వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.