Virat Kohli eyes multiple Sachin records in New Zealand Match: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అందరి కళ్లు టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో తిరిగి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించిన ప్రతి ఒక్కరూ కోహ్లీని పొగడ్తలతో ముంచేశారు. అయితే, కోహ్లీని మరికొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రాణించాలని భారత అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ విజృంభిస్తే.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 85 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్‌పై 3 వేల పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్‌గా నిలువనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో 55 మ్యాచ్‌లు ఆడగా.. 2,915 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై సచిన్ టెండూల్కర్ 3,345 పరుగులు చేసి టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ 3,145 పరుగులు, జాక్వెస్ కలిస్ 3,071 పరుగులు, జో రూట్ 3,068 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అలాగే, విరాట్ కోహ్లీ 106 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటివరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ 1,750 పరుగులతో నంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్‌పై సచిన్ 42 వన్డేల్లో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ 31 వన్డేల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1,645 పరుగులు చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కాగా, రికీ పాంటింగ్.. 51 మ్యాచ్‌లలో 1,971 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.