Breaking News

అమిర్ సొహైల్‌ నా రక్తం మరిగేలా చేశాడు:వెంకటేశ్ ప్రసాద్ల

12 th Jun 2020, UTC
అమిర్  సొహైల్‌ నా రక్తం మరిగేలా చేశాడు:వెంకటేశ్ ప్రసాద్ల

టీమిండియా-పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల సమరం..అది వరల్డ్‌కప్‌  లో అయితే  ఆ మజా వేరు.  అలా ఇరు జట్లు తలపడిన వరల్డ్‌కప్‌ సమరాల్లోని బెస్ట్‌ మూమెంట్స్‌లో 1996 వరల్డ్‌కప్‌ ఒకటి. పాకిస్తాన్‌తో జరిగిన ఆనాటి క్వార్టర్‌ ఫైనల్లో అమిర్‌ సొహైల్‌-వెంకటేశ్‌ ప్రసాద్‌ల పోరు ప్రత్యేకం. వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి ప్రతీ బంతిని ఇలానే కొడతానని అమిర్‌ సంకేతాలివ్వగా, ఆ మరుసటి బంతికే వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌల్డ్‌ చేయడం   భారత్ అభిమానుల మదిలో నిలిచిపోయింది.

అమిర్‌ ఔట్‌ కాగానే ఇక పెవిలియన్‌కు వెళ్లు అంటూ వెంకటేశ్‌ ప్రసాద్‌ చేయి చూపించడం ఇప్పటికీ హైలైట్‌. ఇదే విషయాన్ని తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ గుర్తు చేసుకున్నాడు. 24 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్‌లో సొహైల్‌ తనను రక్తం మరిగేలా చేశాడన్నాడు. నా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన తర్వాత సొహైల్‌ తీరు సరిగ్గా లేదు. సంజ్ఞ చేసిన తర్వాత వాగ్వాదానికి దిగే యత్నం చేశాడు. ఆ ఫోర్‌ కొట్టిన పిదప క్రీజ్‌లోకి వెళ్లాలి. కానీ ఇంకా ఏదో రెచ్చగొట్టే యత్నం చేశాడు.

 దాన్ని దేశం మొత్తం చూసింది. అది నా రక్తం మరిగేలా చేసింది. ఇంకా ఆ వికెట్ ఎంతో అవసరం కూడా. దాంతో తదుపరి బంతిని లైన్‌ లెంగ్త్‌లో వేయగా సొహైల్‌ ఆవేశపడి వికెట్‌ సమర్పించుకున్నాడు. దాంతో నాకు కూడా ఆవేశం వచ్చింది. సొహైల్‌ పెవిలియన్‌కు వెళుతున్న క్రమంలో నేను కూడా అదే తరహా సంజ్ఞతో వీడ్కోలు చెప్పా. ఏదో అనబోయి కాస్త కంట్రోల్‌లోకి వచ్చేశా.

 ఆ సమయంలో జవగళ్ శ్రీనాథ్‌, సచిన్‌ టెండూల్కర్‌, అజహర్‌ తదితరులు నా వద్దకు వచ్చి నన్ను రక్షించారనే చెప్పాలి. లేకపోతే నాకు భారీ జరిమానానే కాకుండా నిషేధం కూడా చూడాల్సి వచ్చేదేమో. అప్పుడు షెఫర్డ్‌ అంపైర్‌గా ఉన్నారు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ మరొకసారి  అప్పటి సంఘటనను క్రికెట్‌ అభిమానుల ముందుకు తెచ్చాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox