Site icon Prime9

India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఆలౌట్

India vs Australia fifth match first innings india all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(10). కేఎల్ రాహుల్(4) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వన్ డౌన్ వచ్చిన శుభమన్ గిల్(20)సైతం విఫలమయ్యాడు. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ(17) అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి స్లిప్‌లో చిక్కాడు. దీంతో భారత్ స్వల్ప పరిధికే కీలక వికెట్లు కోల్పోయింది.

టాప్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తీవ్రంగా ప్రయత్నించారు. క్రీజ్‌లో పాతుకుపోవడంపైనే దృష్టిసారించారు. ఒక్కో పరుగు జోడిస్తూ ముందుకు సాగారు. రెండో సెషన్ ముగిసేసరికి ట్రీ బ్రేక్ సమయానికి భారత్ 107 పరుగులు చేసింది. ట్రీ బ్రేక్ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రిషభ్ పంత్(40) ఔటయ్యాడు. మిడాఫ్‌లో కమిన్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే షాక్ తగిలింది. బోలాండ్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ సైడ్ బంతిని తగిలించి స్లిప్‌లో దొరికిపోయాడు. మరోవైపు బోలాండ్ టెస్ట్ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక, నిలకడగా ఆడుతున్న రవీంద్ర జడేజా(26) ఔటయ్యాడు. మిచెల్ స్లార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే జడేజా డీఆర్ఎస్ తీసుకున్నా ఫలితం సానుకూలంగా రాలేదు. దీంతో సమీక్షలోనూ ఔట్‌గా తేలడంతో జడేజా నిరాశగా పెవిలియన్ చేరాడు. 134 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.

కాగా, కమిన్స్‌ బౌలింగ్‌లో లెగ్ సైడ్ బంతిని ఆడేందుకు ప్రయత్నించి సుందర్(14) ఔట్ అయ్యాడు. తొలుత ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌ ప్రకటించడంతో ఆసీస్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో ఆసీస్‌కు సానుకూల ఫలితం రావడంతో సుందర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రసిద్(3) ఎక్కువసేపు ఉండలేదు. కొన్ స్టాస్ అద్భుతమైన క్యాచ్‌ తీసుకోవడంతో పెవిలియన్ చేరాడు. ఇక, చివరి వికెట్‌గా జస్ ప్రీత్ బుమ్రా(22) ఔటయ్యాడు. దీంతో భారత్ తొలి ఇణ్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశాడు.

Exit mobile version