Breaking News

పోలీసులపై కుక్కలు వదిలిన పొట్లూరి వరప్రసాద్..!

29 th Jun 2020, UTC
పోలీసులపై కుక్కలు వదిలిన పొట్లూరి వరప్రసాద్..!

ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్‌ వి.పొట్లూరి (పీవీపీ)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఓ కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

 తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై  పొట్లూరి వరప్రసాద్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. విల్లాను కొనుగోలు చేసిన తరువాత  వ్యాపారి తన విల్లాను ఆధునీకరించాలని భావించి పనులు మొదలు పెట్టారు. అయితే, ఈ ఆధునీకరణ పనులతో తన ఇంటి ఎలివేషన్‌ దెబ్బతింటోందని, పనులు ఆపేయాలని పీవీపీ హెచ్చరించారు.

దీనిపై ఆయన గతవారం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox