Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. ఇరవై మూడేళ్ల నాడు పార్లమెంటు మీద ముష్కరమూకలు చేసిన దాడిలో తొమ్మిది మంది అమరులు కాగా మరో 18 మంది గాయాలపాలయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటనకు కాస్త ముందుగా పార్లమెంటులోని ఉభయ సభలు వాయిదా పడటంతో చాలామంది నేతలు ఇళ్లకు వెళ్లిపోగా, ఆ సమయానికి ఇంకా 100కి పైగా ఎంపీలు, మంత్రులు పార్లమెంటు భవనంలోనే ఉన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఆత్మాహుతి దళమే పార్లమెంటుపై దాడి జరిపినట్లు ప్రభుత్వ విచారణలో బయటపడింది. ఉగ్రవాదులను.. మహ్మద్, హైదర్, హమ్‌జా, రాణా, రజాలుగా గుర్తించారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అండదండలతోనూ ఈ దాడి జరిగిందనీ తేల్చారు. దుండగులు వాడిన కారు, సెల్‌ఫోన్ రికార్డుల ఆధారంగా ఈ దాడికి కుట్ర పన్నిన వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు అఫ్సాన్‌ను నిర్దోషిగా తేల్చగా, గిలానీ, షౌకత్‌తోపాటు అఫ్జల్ గురులకు మరణశిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లిన గిలానీ నిర్దోషిగా బయటకు రాగా.. షౌకత్ మరణశిక్షను పదేళ్ల కఠిన కారాగార శిక్షకు తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చినా, దాడుల సూత్రధారి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధిస్తూ సెప్టెంబర్ 26,2006న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై నిందితుడి కుటుంబం క్షమాభిక్షకు ప్రయత్నించినా, నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకు నిరాకరించారు. దీంతో ఫిబ్రవరి 9,2013న ఢిల్లీలోని తిహాడ్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలయ్యింది.
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాకు చెందిన అఫ్జల్ ఎంబీబీఎస్ తొలిఏడాది చదువుతూ ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా, మిలిటెంట్లతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే పాకిస్థాన్, ఘజియాబాద్ నుంచి దొంగచాటుగా దేశంలోకి వచ్చే వారి వల్ల ఆర్థికంగా లాభపడి, ఓ కమీషన్ ఏజెన్సీ పెట్టి కొన్నాళ్లు వ్యాపారం కూడా చేశాడు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సభ్యుడిగా మారి, ఉగ్రవాద శిక్షణా పొందాడు. ఆతర్వాత జైష్-ఈ- మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం కూడా కల్పించాడు. ఇలా.. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన అఫ్జల్ గురుకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని నాడు విచారణ సంస్థలు సుప్రీంకోర్టు ముందుంచటంతో సుప్రీంకోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. అరెస్టు తర్వాత కూడా పార్లమెంటుపై దాడిని అఫ్జల్ గురు సమర్థించుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన 2009 ప్రాంతంలో స్థానిక ఉర్దూ వార పత్రిక సంపాదకుడు షబ్నం ఖయ్యూంకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అందులో పార్లమెంటుపై తన దాడి సబబే అని, ఆ విషయంలో తాను సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం లేదని రాశాడు. అయితే, భారత దేశపు ఆత్మగా చెప్పే పార్లమెంటుపై దాడిచేసిన అఫ్జల్ గురుకు మద్దతుగా మాట్లాడే పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇంకా ఈ పుణ్యభూమిలో పదుల సంఖ్యలో కనిపిస్తూనే ఉన్నాయి.
తీహార్ జైలులో ఖననం చేయబడిన అఫ్జల్ గురు శరీర అవశేషాలను తమకు అప్పగించాలని కాశ్మీర్‌లోని పీడీపీ పార్టీ అప్పట్లో డిమాండ్ చేసింది. ఆయన అస్తికలను వెనక్కి తెచ్చి స్మారకం నిర్మిస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పార్టీ రాతపూర్వక హామీ కూడా ఇచ్చింది. అఫ్జల్ ఉరి వల్ల ఒనకూడిన ప్రయోజనం ఏమీ లేదని నేటి కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. అఫ్జల్ ఉరితీత అన్యాయమని కాంగ్రెస్ నేత చిదంబరం వాపోయారు. ఈ కేసులో అతడు దోషి అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవనీ, నాటి దాడిలో అఫ్జల్ పాత్ర ఉన్నా, అది ఏ స్థాయిలో ఉందో చెప్పలేమని, వెరసి ఉరి తీసేటన్ని సాక్షాలు లేవని పెదవి విరిచారు. మరి దీనిపై.. అప్పట్లో మీరు కేంద్రమంత్రిగా ఉండి నోరు విప్పలేదేమని అడగగా, హోంశాఖ తన పరిధిలో లేదంటూ దాటవేశారు. తర్వాత జేఎన్‌యూలో అఫ్జల్ వర్థంతి నాడు వినిపించిన జాతివ్యతిరేక నినాదాలపైనా చిదంబరం ఇలాగే స్పందించారు. ఈ రోజుల్లో పిల్లలకి తప్పుగా మాట్లాడే అధికారం ఉందనీ, అంతమాత్రాన వారిని జాతి విద్రోహులు అనలేమని సెలవిచ్చారు. ఇలాంటి నినాదాలు చేసిన వారికి మద్దతుగా రాహుల్ గాంధీ సదరు వర్సిటీని సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెల్పటమూ తెలిసిందే.
ఇక.. ఇప్పడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆతిషి మార్లేనా తల్లిదండ్రులు.. తండ్రి విజయ్ సింగ్, తల్లి తృప్తా వాహి అఫ్జల్ ఉరిని తప్పించటానికి ఆందోళనలు చేయటం మొదలు రాష్ట్రపతికి లేఖలు రాయటం వరకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేసిన ఈ పుణ్య దంపతులు… కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన సైనికుల కుటుంబాల కోసం నిధి వసూలు చేస్తుంటే.. ‘చావడానికి జీతం తీసుకునే వాళ్ళకు ఎందుకు సాయం చేయాలి?’అని నిలదీశారు. ఇలా చెప్పుకుంటే ఇలాంటి అప్జల్ అభిమానుల జాబితా కొండవీడు చేంతాడంత అవుతుంది. ఇరవై మూడేళ్ల నాటి పార్లమెంటుపై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులను ఈ దేశం ఏ మేరకు గుర్తుంచుకుందో తెలియదు గానీ, తమ స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసం కొందరు అవసరమైనప్పుడల్లా అఫ్జల్ గురును బతికిస్తూనే ఉన్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.