Breaking News

మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

29 th Jun 2020, UTC
మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా జూలై 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.అత్యవసరాలు మినహా.. అన్ని ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అత్యవసర సేవలు, కార్యాలయాలకు వెళ్లేవారిని మాత్రమే అనుమతించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.
ముంబై మెట్రో పాలిటన్ నగరంలో అన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో కనీసం 10 మంది లేదా 10 శాతం మందితో విధులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చునని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

 ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం 15 మంది లేదా 15 శాతం మందితో కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. వైద్య శాఖ, పోలీస్ శాఖ లాంటి అత్యవసర సేవలు అందించే శాఖల్లో పనిచేసే వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యవసరాలు, నిత్యావ‌సరాల‌కు సంబంధించిన అన్ని ర‌కాల వ్యాపార‌ కార్యకలాపాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని స్పష్టం చేసింది. అత్యవసంకానీ వాటిలో వేటిని అనుమ‌తించాలి, వేటిని అనుమతించ‌కూడ‌దు అనే విష‌యంలో స్థానిక అధికార యంత్రాంగమే నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపింది.

దేశంలో మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా,  కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది.  ఒక్క ఆదివారం నాడే రాష్ట్రంలో5,493 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 86,575 మంది డిశ్చార్జి కాగా, 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox