Breaking News

ట్రంప్ తో విభేదించిన అమెరికా రక్షణమంత్రి..!

05 th Jun 2020, UTC
ట్రంప్ తో విభేదించిన అమెరికా రక్షణమంత్రి..!

జార్జ్‌ ఫ్లాయిడ్‌ దారుణ హత్య అనంతరం అమెరికాలో చెలరేగిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని దించుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలతో ఆ దేశ రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ విభేదించారు. మిలిటరీని దించేందుకు అనుమతించే ‘తిరుగుబాటు చట్టాన్ని’ అత్యవసర, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడే వినియోగించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఫ్లాయిడ్‌ పట్ల మినియాపొలిస్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది హత్య, దారుణమైన నేరమని వ్యాఖ్యానించారు. కాగా, అల్లర్లతో దెబ్బతిన్న చర్చి వద్దకు ట్రంప్‌తో కలిసి వెళ్లడంపై ఎస్పర్‌ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీనిపై ఆయన స్పందిస్తూ.. చర్చి వద్దకు వెళ్తున్నట్లు తనకు తెలుసునని, అయితే అక్కడ అధ్యక్షుడు ట్రంప్‌ ఫొటో దిగే విషయం తనకు తెలియదని చెప్పారు. అంతకుముందు అక్కడి సమీపంలోని పార్కు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టిన విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. మరోవైపు, నిరసనల విషయంలో ట్రంప్‌ మాత్రం దూకుడును కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్‌లో పెద్ద ఎత్తున నేషనల్‌ గార్డ్‌ బలగాలను మోహరించడంపై ఆయన స్పందిస్తూ.. హింసను ఏ విధంగా నియంత్రించాలో రాష్ట్రాలకు ఇది ఒక మోడల్‌ అని వ్యాఖ్యానించారు. ‘సమస్యాత్మక ప్రాంతాలు రిపబ్లికన్ల పాలనలో లేవన్న విషయాన్ని గుర్తించాలి. డెమోక్రాట్లే వాటిని పాలిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

అల్లర్లు అదుపుచేయడంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరును హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అసెవెడో తీవ్రంగా విమర్శించారు. సైన్యాన్ని మోహరిస్తానన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘దేశంలోని పోలీస్‌ అధిపతుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం చెబుతున్నా. మీ వద్ద చెప్పడానికి విలువైన విషయాలేవీ లేకపోతే దయచేసి నోరు మూసుకుని ఉండండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox