బెంగాల్: పశ్చిమ బెంగాల్ అధికార గణాన్ని, పోలీసులను రాజకీయ శృంఖలాల నుంచి విడుదల చేయాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆదివారం ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి మమత బెనర్జీని కోరారు. చట్ట విరుద్ధంగా బాంబులను తయారు చేసేవారు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీంతో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ప్రతిపక్షాల తలుపు తట్టేందుకు పోలీసులు, అధికార గణం ఎల్లప్పుడూ అధికార పార్టీ గుమ్మం దగ్గర కాచుకుని కూర్చోవడం దురదృష్టకరమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంటే పార్టీ కార్యకర్తలు కాదన్నారు. వారు పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తించినట్లయితే, అది భారత రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని చెప్పారు.
ఇది చట్ట నిబంధనలకు, ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బ అని తెలిపారు. పోలీసులు, పరిపాలనా యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరికి పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు కట్టుబడిన పోలీసులు, అధికారగణం ప్రజాస్వామ్యానికి మృత్యుఘంటిక అని పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులంటే పార్టీ కార్యకర్తలు కాదన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇంతలా లొంగిపోతారని ఎన్నడూ అనుకోలేదని వాపోయారు. ప్రవర్తనా నియమావళిని సైతం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా మోకరిల్లుతారని భావించలేదన్నారు. వారి చర్యలు బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామిక సారం నిర్వీర్యమవుతోందన్నారు. ఇటువంటిదానిలో పాలుపంచుకోవడం ఎందుకని, ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేయడం ఎందుకని ప్రశ్నించారు.