Breaking News

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ లపై స్పీడందుకున్న ఈడీ దర్యాప్తు..!

11 th Jun 2020, UTC
నీరవ్‌ మోదీ,  మెహుల్‌ చోక్సీ లపై స్పీడందుకున్న ఈడీ దర్యాప్తు..!
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ(48), మెహుల్‌ చోక్సీ( 60)పై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్‌లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్‌ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్‌ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి.

ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్‌ నుంచి దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా పరారయ్యారు.

 దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్‌లో నీరవ్‌ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీజ్‌ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్‌లో అరెస్టు చేశారు.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ని రూ.14,000 కోట్ల మేరకు మోసం చేసిన వ్యవహారంతో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా పాలిష్డ్‌ వజ్రాలు, ముత్యాలు, వెండి ఆభరణాలను వెనక్కి తీసుకురావడానికి హాంకాంగ్‌లో అన్ని న్యాయపరమైన లాంఛనాలను పూర్తి చేసినట్టు ఈడీ తెలిపింది. వీటిని ఇప్పుడు పీఎంఎల్‌ఏ కింద అధికారికంగా సీజ్‌ చేస్తున్నట్టు పేర్కొంది.
 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox