న్యూఢిల్లీ:భారత్, చైనాల మధ్య వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నామని, అవి సఫలం కాకపోతే మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా అతిక్రమణలను ఎదుర్కోవడానికి భారత సైన్యం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోంది. ఎల్ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం సైనిక చర్యలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం’ అని బిపిన్ రావత్ పేర్కొన్నారు.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని రావత్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంకొనసాగుతుంది. ఇక జూన్ 15న చైనా- భారత్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించడంతో దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.